Nara Chandrababu Naidu |నమో గంగమ్మ తల్లీ
Nara Chandrababu Naidu | నమో గంగమ్మ తల్లీ
- ఏపీ సీఎం దంపతుల ప్రణామం
- వైభవంగా ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర
- కుప్పంలో పోటెత్తిన భక్తజనం
Nara Chandrababu Naidu | కుప్పం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి కుప్పంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంను బుధవారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సీఎం దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం కోసం గంగమ్మ తల్లిని ప్రార్థించారు.

ఉదయం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం కాన్వాయ్ ఆలయానికి చేరుకోగానే భక్తులు భారీగా తరలివచ్చి హర్షధ్వానాలతో స్వాగతం చెప్పారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

అనంతరం సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పట్టువస్త్రాలను సమర్పించారు. వీటితో పాటు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదాన్ని కూడా అమ్మవారికి కానుకగా అందజేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, సీఎం దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిసింది.

ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు సీఎం దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం శేషవస్త్రాలు సమర్పించి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆలయ చరిత్ర, జాతర వైభవం గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. గంగమ్మ జాతర ప్రాంతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.

జాతర సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ భారీగా కనిపించింది. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆలయ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో సీఎం చంద్రబాబు మార్గమధ్యంలో తంజమ్మకొట్టాల వద్ద తాటి ముంజలు తీస్తున్న గీత కార్మికులను గమనించి తన కాన్వాయ్‌ను ఆపించారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి తాటి ముంజలను రుచి చూశారు. గీత కార్మికుల జీవన పరిస్థితులు, ఉపాధి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం తమ వద్దకు వచ్చి మాట్లాడటం ఆనందంగా ఉందని కార్మికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం పర్యటనతో కుప్పం పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
CLICK HERE TO TEAD MORE : Russia China Strategic : దోస్త్ మేరా..దోస్త్..Andhra Prabha Top Story
