నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ

నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ
- జిల్లా అభివృద్ధికి ప్రాధాన్య రంగాలకు బ్యాంకులు రుణాలు అందించాలి
- నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్య రంగాలలో బ్యాంకులు సమర్థవంతంగా రుణాలు అందించి రైతులు, వ్యాపారులు, యువతతో పాటు ఇతర లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు.
మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నాబార్డ్ రూపొందించిన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పి ఎల్ పి) పుస్తకాన్ని జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు మరియు ఇతర ప్రాధాన్య రంగాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ఈ క్రెడిట్ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు.
జిల్లాలోని వివిధ రంగాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను విశ్లేషించి, వాటి ఆధారంగా బ్యాంకులు అందించగల రుణ సామర్థ్యాన్ని ఈ నివేదికలో అంచనా వేశారని ఆయన పేర్కొన్నారు.
రంగాల వారీగా రుణ అంచనాలు ఇలా ఉన్నాయి:
2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా మొత్తం ప్రాధాన్య రంగాల రుణ సామర్థ్యాన్ని రూ.14,740.65 కోట్లుగా నాబార్డ్ అంచనా వేసింది. ఇందులో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు రూ.9,283.49 కోట్లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (ఎం ఎస్ ఎం ఈ ) రూ.3,653.62 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే విద్యా రుణాలకు రూ.203.17 కోట్లు, గృహ నిర్మాణ రుణాలకు రూ.287.98 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.96.20 కోట్లు, సామాజిక మౌలిక వసతులకు రూ.13.12 కోట్లు, ఎగుమతి రుణాలకు రూ.1.80 కోట్లు, ఇతర రంగాలకు రూ.1,201.25 కోట్లు అంచనా వేసినట్లు వివరించారు.
ఈ PLP నివేదిక ఆధారంగా జిల్లాలోని బ్యాంకులు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ ఎల్ బి సి) ద్వారా 2026 ఏప్రిల్ నెలలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా క్రెడిట్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం రామచంద్రరావు, ఆర్బీఐ లీడ్ బ్యాంక్ అధికారి రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం సుబ్బారెడ్డి, కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ గౌతమ్, సీబీఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ పుష్పకుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
