పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
- మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఇందిరా మహిళా శక్తి భవన్ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడుమల్లు రవి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, మున్సిపల్ చైర్మన్ తీగల సురేందర్ తదితరులు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో వృక్షారోపణ చేపట్టడం అత్యంత అవసరమన్నారు. మొక్కలు మన జీవితానికి ఆధారమని, అవి ఆక్సిజన్‌ను అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటి విజయానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచినప్పుడే కార్యక్రమానికి నిజమైన ఫలితం దక్కుతుందని అన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని కుటుంబ సభ్యుడిలా సంరక్షించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పచ్చదనం పెంపులో ఆదర్శంగా నిలిచిందని, ప్రభుత్వ చర్యల ఫలితంగా అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవన విధానం అందించాలంటే చెట్ల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ప్రకృతి సంపదను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, ఈ ఏడాది వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 35 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, డీఆర్‌డీఏ పీడీ చిన్న ఓబులేసు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
