Ntr-Pg-Centre : చదువులమ్మ బెజవాడకు,, Andhra Prabha Top Story

Ntr-Pg-Centre : చదువులమ్మ బెజవాడకు,, Andhra Prabha Top Story

  • కృష్ణా వర్పిటీ పీజీహారం
  • విజయవాడలో ఎన్‌టీఆర్ పీజీ సెంటర్‌ ఏర్పాటు..
  • కృష్ణా యూనివర్సిటీ కొత్త అధ్యాయానికి శ్రీకారం
  • రాజధాని భవిష్యత్తుకు నైపుణ్య విద్యా భరోసా..
  • ఏఐ నుంచి సైబర్ క్రైమ్ వరకు ఆధునిక కోర్సులు..
  • విద్యా రంగం నుంచి కీలక ముందడుగు
  • రాజధాని ప్రాంత యువతకు ఉపాధి, అవకాశాలు

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించిన చారిత్రాత్మక వేళ, రాజధాని ప్రాంత అభివృద్ధికి విద్యా రంగం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తూ కృష్ణా విశ్వవిద్యాలయం కీలక అడుగు వేసింది. రాజధానికి ముఖద్వారమైన విజయవాడలో పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పేరుతో ఏర్పాటు చేసిన పీజీ సెంటర్ ద్వారా పలు ఆధునిక డిప్లమో, పీజీ డిప్లమో కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈ ప్రాంత యువతకు చక్కటి విద్య వృత్తి నైపుణ్య శిక్షణ లభించే అవకాశం లభించింది.

Ntr-Pg-Centre : విద్యారంగంలో కీలక అడుగు..

అమరావతి అభివృద్ధి అంటే కేవలం పరిపాలనా భవనాలు, రహదారులు, మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదగాలంటే విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల సృష్టి కూడా సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఎన్‌టీఆర్ పీజీ సెంటర్ ప్రారంభం కావడం అమరావతి భవిష్యత్తుకు విద్యా శంఖారావంగా అభివర్ణిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి హాస్పిటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, సైబర్ క్రైమ్, మెరైన్ ఎలక్ట్రానిక్స్, లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యోగా ఇన్‌స్ట్రక్టర్ అండ్ కౌన్సెలింగ్, మ్యూజిక్ తదితర రంగాల్లో డిప్లమో కోర్సులను ప్రవేశపెట్టనుండటం విశేషం. అదేవిధంగా అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్, జర్నలిజం, బయోటెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ వంటి పీజీ డిప్లమో కోర్సులు యువతకు నూతన అవకాశాలు కల్పించనున్నాయి.

Ntr-Pg-Centre : విజయవాడలో మరో..

మచిలీపట్నం కేంద్రంగా రెండు దశాబ్దాలుగా ఉన్నత విద్యా సేవలు అందిస్తున్న కృష్ణా విశ్వవిద్యాలయం ఇప్పుడు విజయవాడలో అడుగుపెట్టడం ద్వారా రాజధాని ప్రాంత విద్యార్థులకు మరింత చేరువవుతోంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు అమరావతి పరిసర ప్రాంతాల విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి కోర్సులను తమ ప్రాంతంలోనే అభ్యసించే అవకాశం పొందనున్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కూన రామ్ జీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న రంగాల్లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా యువతను ఉపాధి, స్వయం ఉపాధి వైపు నడిపించాలన్న లక్ష్యంతో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతోంది.

Ntr-Pg-Centre : ఎన్టీఆర్ పేరుతో..

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పేరుతో ఆయన సొంత జిల్లా పరిధిలో ఈ పీజీ సెంటర్ ఏర్పాటవడం ప్రత్యేకతను సంతరించుకుంది. విద్య ద్వారా సమాజాభివృద్ధి సాధ్యమనే ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించిన సమయంలోనే విజయవాడలో ఎన్‌టీఆర్ పీజీ సెంటర్ ద్వారా నూతన విద్యా కార్యక్రమాలను ప్రారంభించడం కేవలం యాదృచ్ఛికం కాదని, రాజధాని భవిష్యత్తుకు విద్యా రంగం అందించిన శుభసూచక సంకేతమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. పరిపాలనా రాజధానిగా అమరావతి ఎదుగుతున్న తరుణంలో, విజయవాడలో ఈ విద్యా కేంద్రం జ్ఞాన రాజధాని నిర్మాణానికి బలమైన పునాది వేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణం ఇటుకలు, సిమెంటుతో మాత్రమే కాదు… విద్యావంతులైన యువశక్తితోనూ జరుగుతుందనే సందేశాన్ని కృష్ణా విశ్వవిద్యాలయం తన ఎన్‌టీఆర్ పీజీ సెంటర్ ద్వారా రాష్ట్రానికి చాటిచెబుతోంది. అమరావతి అభివృద్ధి గాథలో ఈ విద్యా కేంద్రం మరో మైలురాయిగా నిలవనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.