నత్తనడకన వంద పడకల వైభవం!

నత్తనడకన వంద పడకల వైభవం!

  • మూడేళ్లు దాటినా పూర్తికాని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం
  • నిధుల కొరతతో మొరాయిస్తున్న కాంట్రాక్టర్
  • జాతీయ రహదారి-65 బాధితులకు తప్పని తిప్పలు..
  • దారిలోనే అనంత వాయువుల్లో కలుస్తున్న ప్రాణాలు!
  • మారిన ప్రభుత్వాలు.. మారని పేద ప్రజల తలరాతలు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ​యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో చేపట్టిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పాలకుల నిర్లక్ష్యం, నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ భవనం అందుబాటులోకి రాకపోవడంతో స్థానిక ప్రజలతో పాటు, జాతీయ రహదారిపై ప్రమాదాల బారిన పడుతున్న క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న అత్యవసర పరిస్థితి వచ్చినా మెరుగైన వైద్యం అందక హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది.

​భారీ బడ్జెట్.. కానీ పెండింగ్ బిల్లుల సెగ!

​హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ పట్టణం చుట్టుపక్కల సంస్థాన్ నారాయణపురం, గట్టుప్పల్, భూధాన్ పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట, చిట్యాల తదితర మండలాల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు, నిత్యం జరిగే ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు ఈ ఆసుపత్రి ఎంతో కీలకం. గత మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిఫారసు మేరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 100 పడకల ఆసుపత్రిని మొదట రూ. 35.95 కోట్ల (దాదాపు రూ. 36 కోట్లు) అంచనా వ్యయంతో మంజూరు చేశారు.

అయితే, వంద పడకల అత్యాధునిక భవనానికి ఈ నిధులు సరిపోవని భావించి ప్రభుత్వం మరో రూ. 14 కోట్లు అదనంగా మంజూరు చేయడంతో మొత్తం బడ్జెట్ రూ. 50 కోట్లకు చేరింది. 2023 ఏప్రిల్ 17వ తేదీన అప్పటి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లతో కలిసి ఎంతో వైభవంగా ఈ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ శంకుస్థాపన జరిగి గత 17 ఏప్రిల్ కు మూడేళ్లు దాటినప్పటికి నేటికీ పనులు ముగింపునకు నోచుకోకపోవడం గమనార్హం.

​మారిన ప్రభుత్వాలు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

​ఆసుపత్రి శంకుస్థాపన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారాయి. కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆసుపత్రి పరిస్థితి మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైంది.

ప్రభుత్వం మారడం, నిధుల కొరత వల్ల బిల్లులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను అత్యంత నిమ్మళంగా సాగదీస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి భవన నిర్మాణం దాదాపు 90 శాతం చివరి దశకు చేరినప్పటికీ, చుట్టూ ప్రహరీ గోడ, రోడ్డు నిర్మాణం, మట్టి కుప్పల తొలగింపు, పరిసరాల పరిశుభ్రత వంటి ఇతర పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నత్తనడకన సాగిస్తున్నారు.

​హైదరాబాద్‌కు పరుగులు.. మార్గమధ్యంలోనే ప్రాణాలనంతం!

​చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు సరైన ప్రభుత్వ ఆసుపత్రి గానీ, నిపుణులైన డాక్టర్లు గానీ లేకపోవడంతో పేద రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ చిన్న ఎమర్జెన్సీ వచ్చినా వేలాది రూపాయలు అప్పులు చేసి ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిత్యం ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు చౌటుప్పల్‌లో వసతులు లేవు. దీనివల్ల ఎంతోమంది విలువైన ప్రాణాలు మార్గమధ్యంలోనే గాల్లో కలిసిపోతున్నాయి. సకాలంలో వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే, వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడి అనాథలుగా మారుతున్నాయి.

​కార్పొరేట్ వైద్యం అందించి.. ప్రాణాలు కాపాడాలి!

​ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన 10 శాతం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభించాలని కోరుతున్నారు. కేవలం భవనాన్ని ప్రారంభించడమే కాకుండా, ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్న వైద్యులను ఈ ఆసుపత్రిలో నియమించాలి. కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు, అధునాతన స్కానింగ్ సెంటర్లు, ఆపరేషన్ థియేటర్ల సౌకర్యం కల్పించి, నిపుణులైన డాక్టర్లను అందుబాటులో ఉంచాలని చౌటుప్పల్ డివిజన్ పరిసర ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని బలంగా కోరుతున్నారు.