Mausam App | వర్షాలను ముందే పసిగట్టే యాప్‌.. వివరాలు మీకోసం..

Mausam App | వర్షాలను ముందే పసిగట్టే యాప్‌.. వివరాలు మీకోసం..

Mausam App | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఎండాకాలం చివరి దశకు చేరుకుంది అయితే ముందస్తు రుతుపవనాల రాకతో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కోసారి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, లేదా పొలాల్లో కోతకు వచ్చిన పంట అకాల వర్షాలకు తడిసిపోకుండా కాపాడుకోవడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. వచ్చేది వర్షాల కాలం కావడంతో రైతుల మేలు కోసం ఈ క్లిష్ట సమయంలో భారత వాతావరణ శాఖ ‘మౌసమ్’ అనే మొబైల్ యాప్ రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా వర్షం గురించి ముందుగానే రైతులు తెలుసుకుని, దాని కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

‘మౌసమ్’ యాప్ ప్రత్యేకత ఏంటి?

ఐఎండీ రూపొందించిన ఈ అధికారిక యాప్, వర్షం వచ్చే బిగ్గరగా అలారం మోగించడం ద్వారా రైతులకు ముందుగానే అప్రమత్తం చేస్తుంది. ఇది రైతులకు తమ పంటను సురక్షిత ప్రదేశానికి తరలించడానికి లేదా కప్పి ఉంచడానికి విలువైన సమయాన్ని ఇస్తుంది. ఈ అప్లికేషన్ పూర్తిగా ఉచితం, ఇది గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.

ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి ‘Mausam’ అని టైప్ చేసి, భారత వాతావరణ శాఖకు చెందిన అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత, మీ ఫోన్‌లో జీపీఎస్‌ (లోకేషన్‌) ఆన్ చేయండి. యాప్ ఆటోమేటిక్‌గా మీ ప్రస్తుత స్థానాన్ని గుర్తించడమే కాదు, అక్కడి వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తుంది. జీపీఎస్‌ ఆన్ చేయలేకపోతే, యాప్‌లో ‘జిల్లా’ ,‘మండలం’ ఎంపికలను ఉపయోగించి మీ ప్రాంతాన్ని మానవీయంగా ఎంచుకోవచ్చు.

అలారం నోటిఫికేషన్..
ఇది అత్యంత ముఖ్యమైన దశ ఇది. యాప్‌లోని నోటిఫికేషన్ సెట్టింగ్‌లలో ‘అలారం’ లేదా ‘హెచ్చరిక’ ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి. దీనివల్ల వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు యాప్ అలారం మోగిస్తుంది.

ఈ యాప్ తో రైతులకు ప్రయోజనాలు…

  • అకాల వర్షాల గురించి ముందుగా తెలుసుకోవడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
  • ధాన్యం తడవకుండా జాగ్రత్తపడవచ్చు.
  • సరైన సమయంలో పంట కోత లేదా ఎరువుల వాడకం వంటి పనులను ముందుగా చేసుకోవచ్చు.

అయితే ‘మౌసమ్’ యాప్‌తో పాటు, తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ‘వాతావరణ అలర్ట్‌’లను కూడా క్రమంగా గమనిస్తూ ఉండటం మంచిది. స్థానిక వార్తలు కూడా వర్ష సూచనలపై మరింత స్పష్టతనిస్తాయి. మీ ప్రాంతంలోని ఇతర రైతులకు కూడా ఈ యాప్ గురించి తెలియజేసి, వారిని కూడా అప్రమత్తం చేయండి.

CLICK HERE TO READ Vijayawada-Railway : హైస్పీడ్​ లో అభివృద్ధి Andhra Peadesh Top Story

CLICK HERE TO READ MORE