పోలీస్ పహారాలో అరకొరగా బస్సులు..
పోలీస్ పహారాలో అరకొరగా బస్సులు..
ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల ఇబ్బందులు..
సమ్మె ప్రభావంతో ప్రజలకు భారంగా మారిన ప్రయాణం…
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో బస్సు సర్వీసులు అరకొరగా నడుస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మె బాట పట్టారు.

బుధవారం ఉదయం నుంచి అచ్చంపేట డిపో ముందు కార్మికులు నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్సై సద్దాం, ఉప్పునుంతల ఎస్సై వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో, ఆర్టీసీ డీఎం పీఎంబీ ప్రసాద్ ఆధ్వర్యంలో అవుట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లతో కొంతమేర బస్సులను నడిపిస్తున్నారు. నాగర్ కర్నూల్, దేవరకొండ, మద్దిమడుగు, హైదరాబాద్ వంటి మార్గాల్లో ప్రభుత్వ, అద్దె బస్సులు పరిమితంగా నడుస్తున్నాయి.

ప్రయాణికుల అవస్థలు…
సమ్మె విషయం తెలియని పలువురు ప్రయాణికులు అచ్చంపేట బస్టాండ్‌కు చేరుకుని బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారు. గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ వాహనాల దోపిడి
సమ్మెను అదనుగా భావించిన ప్రైవేట్ వాహన యజమానులు ఛార్జీలను భారీగా పెంచారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు ఒక్కొక్కరిపై రూ.300 వరకు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు వాపోతున్నారు.
“ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు”
ఆర్టీసీ డీఎం పీఎండి ప్రసాద్ మాట్లాడుతూ, సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అవుట్‌సోర్సింగ్ సిబ్బందితో బస్సులను నడిపిస్తూ, పోలీసుల సహకారంతో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని చెప్పారు.
32 డిమాండ్ల పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపు
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బిల్లుల చెల్లింపు, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణ తదితర 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ ఈదువు వెంకన్న స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు దీక్షల్లో పాల్గొంటుండగా, అచ్చంపేట డిపో ముందు టెంట్లు వేసి నిరసన కొనసాగిస్తున్నారు.
సమ్మె ప్రభావం – ప్రజలకు భారంగా మారిన ప్రయాణం
మొత్తం మీద ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో, సాధారణ ప్రజల ప్రయాణం భారంగా మారింది. ప్రభుత్వం, కార్మిక సంఘాలు చర్చలు జరిపి త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
