ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటి సంరక్షించాలి

  • ఊట్కూర్ ఉప సర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్

ఊట్కూర్, ఆంధ్రప్రభ: వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కుటుంబం కనీసం ఆరు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని ఊట్కూర్ ఉప సర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం. భరత్ పిలుపునిచ్చారు.

నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం వన మహోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు ప్రాణవాయువును అందించడమే కాకుండా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని, నాటిన ప్రతి మొక్కను బతికేలా సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వార్డు సభ్యుడు అశోక్ గౌడ్, మాజీ ఎంపీటీసీ హన్మంతు, మాజీ ఉప సర్పంచ్ ఇబాదూర్ రెహ్మాన్, సీనియర్ నాయకుడు మేటి భీమ్‌శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.