దోపిడీ వ్యవస్థ అంతానికి పోరాటమే మార్గం…

దోపిడీ వ్యవస్థ అంతానికి పోరాటమే మార్గం…
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ : దోపిడీ, పీడన లేని సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడడమే విప్లవ పార్టీల ప్రధాన లక్ష్యమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం వెలిదండ గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మేకల కనకారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య, కనకారావులు మాట్లాడుతూ పీడిత ప్రజల పక్షాన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1969లో ఈ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.
రష్యా విప్లవ వీరుడు కామ్రేడ్ లెనిన్ జయంతి రోజే ఈ పార్టీ పురుడు పోసుకోవడం వెనుక బలమైన విప్లవ ఆశయాలు ఉన్నాయని, ఈ ప్రయాణంలో ఎందరో అమరుల త్యాగాలు దాగి ఉన్నాయని వారు కొనియాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. దేశంలో లౌకికత్వాన్ని తుంగలో తొక్కి, మత విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, రేవంత్ సర్కార్ మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కామల్ల నవీన్, అరుణోదయ నాయకులు గండు నాగేష్, చనగాని సాంబయ్య, చింతమళ్ళ అంజయ్య, కామల్ల శ్రీను, పోటు శ్రీహరి, సిహెచ్ లక్ష్మయ్య, జిలకర ముత్తయ్య, కోటయ్య, బిక్షం తదితరులు పాల్గొన్నారు
