Manav Suthar | ఆరు వికెట్లతో అదరగొట్టిన మానవ్ సుతార్
Manav Suthar | ఆరు వికెట్లతో అదరగొట్టిన మానవ్ సుతార్
అరంగేట్రంలోనే తిప్పేశాడు
Manav Suthar |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు. భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 319వ ఆటగాడిగా బరిలోకి దిగిన సుతార్.. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు.
తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్ల హాల్ సాధించడం ద్వారా సుతార్ అరుదైన జాబితాలో చేరాడు. 21వ శతాబ్దంలో అరంగేట్ర టెస్టులో 6 వికెట్లు తీసిన భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ తర్వాత సుతార్ పేరు నిలిచింది. అశ్విన్ 2011లో వెస్టిండీస్‌పై తన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 6/47 ప్రదర్శన చేశాడు.
సుతార్ తన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ దక్కించుకోవడం విశేషం. అఫ్గాన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్‌ను ఔట్ చేసిన సుతార్, పురుషుల టెస్టు క్రికెట్‌లో 25 ఏళ్ల తర్వాత అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన భారత బౌలర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. బంతితోనే కాదు, బ్యాట్‌తోనూ సుతార్ తన వంతు పాత్ర పోషించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసిన అతను, వాషింగ్టన్ సుందర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ 564/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత, బౌలింగ్‌లో సుతార్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
మానవ్ సుతార్ స్పిన్ దెబ్బకు అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒక్కడే ప్రతిఘటించగా, మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక పెవిలియన్ చేరారు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే సుతార్ తన పేరును రికార్డు పుస్తకాల్లో నమోదు చేసుకున్నాడు.
