Private Jet Crash | పైలట్, కో-పైలట్ మృతి

Private Jet Crash | పైలట్, కో-పైలట్ మృతి

Private Jet Crash |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ జెట్ రన్‌వేపై కూలిపోయి పేలడంతో పైలట్, కో-పైలట్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

గల్ఫ్‌స్ట్రీమ్ G200 రకానికి చెందిన జంట ఇంజిన్ల ప్రైవేట్ జెట్ లా రొమానా నుంచి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని తిరిగి లా రొమానా విమానాశ్రయానికి మళ్లించారు.

విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి రన్‌వేపై బలంగా నేలను తాకింది. అనంతరం భారీ శబ్దంతో పేలిపోవడంతో విమానం మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంలో పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ప్రయాణికులెవరూ లేరని, కేవలం పైలట్, కో-పైలట్ మాత్రమే ఉన్నారని డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ ధృవీకరించింది. దీంతో మరింత పెద్ద విషాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా కూలి పేలిపోతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు స్థానిక విమానయాన అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు.