TG | వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెండింగ్‌ వ్యవహారాలపై సీఎం ఆరా

  • మామునూరు విమానాశ్రయంపై సీఎం సమీక్ష
  • విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలి
  • వీలైనంత త్వరగా డిజైనింగ్‌కు పంపడానికి చర్యలు
  • ప్రతి నెలా ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశం

మామునూరు విమానాశ్రయాన్ని కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాల‌ని, నిత్యం రాకపోకలు సాగించేలా ఎయిర్‌పోర్టును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ, పెండింగ్‌ వ్యవహారాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన అన్ని పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

వరంగల్ నగరానికి విమానాశ్రయం ఒక అసెట్ గా.. ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నారు. భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి డిజైనింగ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి.. ప్రతి నెలా ప్రగతి నివేదికను తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *