కాసిపేట 1-ఏ గనిలో ‘మ్యాన్ రైడింగ్’ ప్రారంభం

కాసిపేట 1-ఏ గనిలో ‘మ్యాన్ రైడింగ్’ ప్రారంభం
- కార్మికుల కష్టాలను తీర్చడమే లక్ష్యం
- డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు
- యువ కార్మికులు సంస్థను కాపాడుకోవాలి..
- నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల శ్రమను తగ్గించి, పని స్థలాలకు సులువుగా చేరుకునేందుకు వీలుగా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1-ఏ గనిలో ఏర్పాటు చేసిన ‘మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ సిస్టం’ను శుక్రవారం డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. కార్మికులకు నడక భారాన్ని తగ్గించి, రక్షణతో కూడిన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాసిపేట గనిలో నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఉత్పత్తిని పెంచేందుకు కార్మికులు కృషి చేయాలని కోరారు.
ముఖ్యంగా యువ కార్మికులు సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. సంస్థ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. కాసిపేట గని భవిష్యత్తు ఎంతో బాగుందని, ఇక్కడి కార్మికులు కష్టపడి పనిచేసే తత్వం గలవారని కొనియాడారు. గని విస్తరణ కోసం భూసేకరణ జరిగిందని, పరిసర గ్రామాల అభివృద్ధికి సైతం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ.. గని ఆధునీకరణలో డైరెక్టర్ పాత్ర కీలకమన్నారు. గనికి నూతన ఎస్డీఎల్స్, సేఫ్టీ మెటీరియల్స్ సకాలంలో అందించాలని కోరారు. ఏజెంట్ రాంబాబు మాట్లాడుతూ.. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సతీష్, ఎస్ ఓ టు జీఎం ప్రసాద్, పర్సనల్ మేనేజర్ అశోక్, ఇంజనీర్ ఝా, బాబు, సలేంద్ర సత్యనారాయణ, మీనుగు లక్ష్మీనారాయణ, రక్షణ అధికారి నిఖిల్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, హిమాలయ, సంక్షేమ అధికారి మీర్జా, బన్న లక్ష్మణ్ దాస్, రాజేందర్, సంతోష్, శ్రీనివాస్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
