గోదాంల వద్ద విషాదం.. నిద్రే ప్రాణాలు తీసింది..

నస్పూర్, ఆంధ్రప్రభ మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని గోదాంల వద్ద లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మక్కజొన్న అన్‌లోడింగ్ కోసం వచ్చిన లారీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక డ్రైవర్లు తెలిపారు.
వారి వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నార్ గ్రామానికి చెందిన ఇంద్రవర్ శంకర్ (42) ఐదు రోజుల క్రితం మొక్కజొన్న లోడుతో గోదాంలకు వచ్చాడు. అయితే, లారీ అన్‌లోడింగ్ ఆలస్యం కావడంతో అక్కడే ఉండాల్సి వచ్చింది.
ఆదివారం రాత్రి నిద్రించేందుకు మొక్కజొన్న బస్తాలపైకి ఎక్కి పడుకున్న శంకర్, నిద్రమత్తులో ప్రమాదవశాత్తూ లారీపై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న నస్పూర్ ఎమ్మార్వో సంతోష్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ ప్రశాంత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
