శంకర్ గౌడ్ మృతి పై బీజేపీ ఆగ్రహం…

మోత్కూర్, ఆంధ్రప్రభ ; వరంగల్ జిల్లా నర్సంపేట లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని,కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని బీజేపీ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా, ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుందని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక ప్రాణం బలైందన్నారు.
నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. 80 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ, తరువాత హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా, చివరకు ప్రాణాలు కోల్పోయాడని, తక్షణమే శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, వెంటనే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బిజెపి మండల పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు గుంటి సతీష్, నార్సింగ్ మహేష్, బండ నరసింహ, బండ నర్సిరెడ్డి, నాయిని ఉపేందర్, ఇట్టబోయిన ఆంజనేయులు, నల్ల పోగుల వెంకన్న , బత్తిని సతీష్ తదితరులు పాల్గొన్నారు.
