వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా పుట్టపాగ వెంకటస్వామి
ప్రధాన కార్యదర్శిగా కందికొండ మోహన్ ఎన్నిక
నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపిక
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సింగిల్ విండో సమావేశ భవనంలో ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి, ఎం. సందీప్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
సొసైటీలోని 11 మంది డైరెక్టర్ల స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలవడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా పుట్టపాగ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడిగా మునగాల చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శిగా కందికొండ మోహన్, కోశాధికారిగా సురేష్‌రావు ఎన్నికయ్యారు.
డైరెక్టర్లుగా కేఎస్ సురేష్, ఖానాపురం ప్రదీప్, రాజేష్ కుమార్ గౌడ్, గబ్బి సత్యనారాయణ, మహమ్మద్ దర్వేష్, కొండకింది మాధవరెడ్డి, తిప్పర్తి విజయ్ ఎన్నికయ్యారు. మొత్తం 25 మంది సభ్యుల్లో 20 మంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పుట్టపాగ వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి కందికొండ మోహన్, ఉపాధ్యక్షుడు మునగాల చంద్రశేఖరరావు, కోశాధికారి సురేష్‌రావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత కమిటీ చేపట్టిన పనులను పూర్తి చేసి, సభ్యుల సహకారంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పారు.
నూతన కార్యవర్గానికి ఘన సన్మానం
నూతన కార్యవర్గ సభ్యులను మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో సొసైటీ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, మాజీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్ నాయకత్వంలో సొసైటీకి స్థలం సాధించడం, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారంలో సుమారు 80 శాతం పురోగతి సాధించడం అభినందనీయమన్నారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు సేవలందించిన అహ్మదుల్లా ఖాన్‌తో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి దినకర్రావు, జెమిని సురేష్, సురేష్‌రావు తదితరుల సేవలను కొనియాడారు.
సీనియర్ జర్నలిస్టుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతూ, వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, గృహాలు సాధించే దిశగా కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు పుట్టపాగ వెంకటస్వామి తెలిపారు.
