Vijayawada ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం..
Vijayawada ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం..
చివరి శుక్రవారం కనకదుర్గమ్మ దర్శనానికి భారీ రద్దీ
ఇంద్రకీలాద్రి (Vijayawada), ఆంధ్రప్రభ : వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో చివరి శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి భక్తుల రాక అనూహ్యంగా పెరగడంతో ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భారీ రద్దీ కారణంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అమ్మవారి దర్శనం వేగంగా లభించింది.
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. దీంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదాన సేవలు నిర్వహించి భక్తులకు ఉపశమనం కల్పించారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగినప్పటికీ ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించారు.
మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ రోజంతా ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. భక్తుల సౌకర్యాల కోసం చేపట్టిన ఏర్పాట్లపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

