జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
- అపోలో సహకారంతో అభివృద్ధి పనులకు ఆమోదం..
- ఎంపీ ల్యాడ్స్‌తో రూ.25 లక్షల పనులు.. డయాలసిస్ రోగులకు 10 పడకలు
చిత్తూరు, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆధునికీకరించి, రోగులకు మెరుగైన సేవలు అందించేలా పలు అభివృద్ధి పనులకు శనివారం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
చిత్తూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, డీసీహెచ్ఓ డాక్టర్ పద్మాంజలి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, అపోలో ఆసుపత్రి వైద్య బృందం సభ్యులు డాక్టర్ రంగనాథ్, డాక్టర్ బాలరాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అన్ని వర్గాల సహకారంతో ఆదర్శవంతమైన వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి కమిటీ సభ్యులు ఇచ్చే సూచనలను అమలు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆసుపత్రిని పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు పలు అభివృద్ధి పనులకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అపోలో ఆసుపత్రి సహకారంతో 10 కంప్యూటర్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డయాలసిస్ రోగుల కోసం 10 పడకలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు, అంబులెన్స్ సౌకర్యాల విస్తరణ, వాచ్మెన్లు సహా ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రతి నెలా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న భవనాలు, వార్డులను త్వరలో జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించి, వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఆగస్టులో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లి అదనపు నిధుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు.
సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పి. అరుణ్ కుమారి, సురేష్, విజయ్ కుమార్, ఎల్. రమేష్, డాక్టర్ కె. విజయ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకట ప్రసాద్, ఇతర వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్యా విధానం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు.
