ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత పునరుద్ధరించాలి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత పునరుద్ధరించాలి
చేవెళ్ల, ఆంధ్రప్రభ : మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వెంటనే వై కేటగిరి భద్రతను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ దేశముల ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియలు డిమాండ్ చేశారు. పోక్సో కేసులో బండి భగీరథను అరెస్టు చేయాలని ఉద్యమాన్ని నడిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కక్షగట్టి భద్రతను తొలగించడాన్ని నిరసిస్తూ… బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. నక్సలైట్ల, ఫ్యాక్షనిస్టుల హిట్ లిస్టులో ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఉన్నారని తెలిపారు. ప్రవీణ్ కుమార్ కు ఏదైనా అఘాయిత్యం జరిగితే దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రవీణ్ కుమార్ ఎండగడుతున్నారని వివరించారు. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అణిచి వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పి. ప్రభాకర్, మాజీ ఎంపీపీ విజయ భాస్కర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ బేగరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
