కర్నూలుకు భారీ పెట్టుబడులు: మంత్రి టీజీ భరత్

ఓర్వకల్లులో రూ.300 కోట్ల ఈవీ పరిశ్రమ

ఎర్రబురుజులో పింఛన్ల పంపిణీ

హైకోర్టు బెంచ్‌పై మంత్రి స్పష్టీకరణ

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. జిల్లాకు భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నామని, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంలో త్వరలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ ఏర్పాటు కానుందని వెల్లడించారు.

బుధవారం కర్నూలు నగరంలోని ఎర్రబురుజు ప్రాంతంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటి వద్దకే అందిస్తూ అర్హులకు సామాజిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచి వలసలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఓర్వకల్లులో రానున్న ఈవీ తయారీ పరిశ్రమ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అలాగే రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, జిల్లాలో జూలై నెలకు సంబంధించి 2,34,252 మంది లబ్ధిదారులకు రూ.102.98 కోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. మహాత్మానగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.