కుప్పానికి రూ.1,002 కోట్ల మెగా పెట్టుబడులు..
రూ.786 కోట్లతో డెయిరీ న్యూట్రీషన్ ప్లాంట్..
రూ.216 కోట్లతో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్
1,480 మందికి ప్రత్యక్ష ఉపాధి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన కుప్పం నియోజకవర్గం పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. స్థానిక యువతకు ఉపాధి కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కుప్పంలో రెండు భారీ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో గుడిపల్లె మండలం బీసంతంలో రూ.216 కోట్లతో అత్యాధునిక చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, కుప్పంలో రూ.786.15 కోట్లతో ప్రపంచస్థాయి డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో మొత్తం రూ.1,002.15 కోట్ల పెట్టుబడులు కుప్పం ప్రాంతానికి రానుండగా, 1,480 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక రాయితీలతో దేశీయ, విదేశీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితమవుతున్నాయి. ఇందులో భాగంగా న్యూట్రి ఫీడ్స్ అండ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుడిపల్లె మండలం బీసంతంలో చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 480 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పౌల్ట్రీ రైతులకు నేరుగా మార్కెట్, మెరుగైన ధరలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కలగనున్నాయి. ఈ పరిశ్రమకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ-2024-29 కింద రూ.83.49 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.786.15 కోట్లతో ప్రపంచస్థాయి డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కుప్పంలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, పాల సేకరణ, రవాణా, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ తదితర అనుబంధ రంగాల్లో వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. శిశు పోషకాహార ఉత్పత్తులు, స్పోర్ట్స్ న్యూట్రీషన్, మెడికల్ న్యూట్రీషన్, వే ప్రొటీన్, పాలపొడి, నెయ్యి, బటర్ ఫ్యాట్ తదితర అధిక విలువ కలిగిన ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌కు ఎగుమతులు చేస్తున్న సంస్థ భవిష్యత్తులో దక్షిణాసియా, ఆఫ్రికా, అమెరికా మార్కెట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పాడి, పౌల్ట్రీ రంగాలు బలంగా ఉండటం, ముడి పదార్థాలు సమృద్ధిగా లభించడం, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారులు, రైల్వే, పోర్టుల అనుసంధానం ఉండటం వల్ల కుప్పం పరిశ్రమలకు అనువైన కేంద్రంగా మారింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో పాటు కోల్డ్ స్టోరేజీలు, ప్యాకేజింగ్, గిడ్డంగులు, లాజిస్టిక్స్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ఊతమివ్వనున్నాయి. కుప్పాన్ని దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రీషన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
