చిన్నారుల రక్షణకు ‘ఆపరేషన్ ముస్కాన్’
జూలై నెలంతా ప్రత్యేక కార్యక్రమం
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: డీసీపీ
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, బాల కార్మికులను రక్షించడం, వారికి సంరక్షణ, పునరావాసం కల్పించడమే ‘ఆపరేషన్ ముస్కాన్’ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. బుధవారం పలు ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ పోలీసుల మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు ‘ఆపరేషన్ ముస్కాన్-2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాల కార్యాచరణతో పాటు అమలు చేయాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కోసం అన్ని శాఖలు సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించడంతో పాటు, బాలల దోపిడీకి పాల్పడే వ్యక్తులు, బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
