సిలిండర్ బుకింగ్‌లో 25 రోజుల గ్యాప్ తప్పనిసరి

సిలిండర్ బుకింగ్‌లో 25 రోజుల గ్యాప్ తప్పనిసరి
- మే 1 నుంచి మారనున్న రూల్స్
- సిలిండర్ బుకింగ్‌లో 25 రోజులు గ్యాప్
- ధరలోనూ మార్పు వచ్చే అవకాశం
అమరావతి, ఆంధ్రప్రభ: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో చమురు సరఫరాలో ఆలస్యం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఆటంకం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సరఫరా సజావుగా సాగేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. గృహ అవసరాలకు ఎల్పీజీ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అలాగే డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఆన్‌లైన్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 99 శాతానికి చేరుకున్నాయని తెలిపింది. ఓటీపీ ఆధారిత డెలివరీలు 9.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. అంతేకాక పీఎన్‌జీ కనెక్షన్ల సంఖ్య దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షలకు చేరినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలోని ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోలేదని, అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.
మరోవైపు మే 1వ తేదీ నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నట్లు సమాచారం. కొత్త రూల్స్ బుకింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు రానున్నట్లు సమాచారం. అలాగే సిలిండర్ బుకింగ్స్‌లోనూ మార్పులు ఉండనున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్‌లో 25 రోజుల గ్యాప్ తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం. అలాగే ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థను ఇకపై శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఈ నిబంధన ప్రకారం నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపబడుతుంది. ఆ ఓటీపీ చెప్పినప్పుడే సిలిండర్ డెలివరీ జరుగుతుంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్-జులై నాటికి ఈ సరఫరా పూర్తి కానుంది. ప్రస్తుతం భారత్‌కు రోజుకు సుమారు 80 వేల టన్నుల ఎల్పీజీ అవసరం ఉండగా, దేశీయ ఉత్పత్తి మాత్రం రోజుకు 46 వేల టన్నులకే పరిమితమై ఉంది. ఇటీవల ప్రభుత్వ చమురు, గ్యాస్ సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఒక నెల పాటు కొత్త కనెక్షన్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ నిబంధనను తొలగిస్తామని అధికారులు తెలిపారు.
