భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ముప్పు

భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ముప్పు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హార్ముజ్ జలసంధిలో ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని యూనియన్ బ్యాంక్ హెచ్చరించింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, రూపాయి విలువపై కూడా ఒత్తిడి పడే అవకాశం ఉందని తెలిపింది. “హార్ముజ్ నుండి రూపాయి వరకు: యుద్ధం, చమురు మరియు ప్రమాదాల ప్రపంచ అంచనాలు” అనే శీర్షికతో యూనియన్ బ్యాంక్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగితే బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100–110 డాలర్ల మధ్య ఉండే అవకాశముంది. దీని ప్రభావం భారత్‌తో పాటు ఇతర దేశాలపై కూడా పడే అవకాశం ఉంది.
వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం 4 శాతానికి పైగా చేరే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. బ్రెంట్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఉండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, దేశీయ మార్కెట్లకు శుభ సూచకం కాదని పేర్కొంది. తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకునే భారతదేశంపై ఈ ప్రభావం ఇప్పటికే కనిపిస్తున్నదని తెలిపింది. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటం వల్ల ధరలు పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ పరిణామాల ఫలితంగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 95 సమీపానికి చేరి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. కరెంట్ అకౌంట్ లోటు (CAD), దిగుమతి ద్రవ్యోల్బణం కారణంగా ఈక్విటీ మార్కెట్లపై కూడా ఒత్తిడి పెరుగుతోందని వివరించింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ప్రతి 10 డాలర్లు పెరిగితే కరెంట్ అకౌంట్ లోటు గణనీయంగా పెరిగి, ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథావిధిగా ఉంచినప్పటికీ, తీవ్ర అస్థిరత ఏర్పడితే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. భారతదేశ భవిష్యత్ ఆర్థిక అంచనాలు పశ్చిమ ఆసియాలోని యుద్ధ పరిస్థితులు ఎలా మారుతాయన్నదానిపై ఆధారపడి ఉంటాయని నివేదిక పేర్కొంది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కీలక ప్రభావకాలు అని వివరించింది.
