6 గంటల్లోనే కిడ్నాప్ కేసు ఛేదన
చిన్నారిని సురక్షితంగా రక్షించిన పోలీసులు.. ఇద్దరు మహిళల అరెస్టు
తలమడుగు, ఆంధ్రప్రభ: తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆత్రం గంగామణి కిడ్నాప్‌కు గురైన కేసును జిల్లా పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించి, చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ నెల 28న రూయ్యడి గ్రామానికి చెందిన నిందితురాలు నైతం నాగుబాయి చిన్నారిని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆదిలాబాద్‌కు తీసుకెళ్లి, తనకు పరిచయమైన భారతి అనే మహిళ వద్ద ఉంచింది. చిన్నారి తల్లి ఆత్రం కప్లీబాయి తలమడుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సైలు విష్ణువర్ధన్, రాధికతో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టాయి.
అదే రోజు రాత్రి 11 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడలో చిన్నారిని గుర్తించి సురక్షితంగా రక్షించారు.
బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ చిన్నారిని ఆమె తల్లిదండ్రులు ఆత్రం జంగు, ఆత్రం కప్లీబాయికి అప్పగించారు. తమ కుమార్తెను క్షేమంగా తిరిగి అందించిన పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటామని తల్లిదండ్రులు భావోద్వేగంతో తెలిపారు.
ఈ ఘటనలో చిన్నారిని కిడ్నాప్ చేసిన నైతం నాగుబాయి, అలాగే చిన్నారిని అక్రమంగా తన వద్ద ఉంచుకున్న గుమ్మడివార్ భారతి (25)ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చిన్నారులు కనిపించకుండా పోయినా లేదా అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సైలు రాధిక, విష్ణువర్ధన్తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
