బాసరలో వైభవంగా వ్యాస పౌర్ణిమ ఉత్సవాలు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రామారావు పటేల్..
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
బాసర, ఆంధ్రప్రభ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వ్యాస పౌర్ణిమ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు రోజులపాటు కొనసాగిన ఉత్సవాల్లో భాగంగా బుధవారం వ్యాస పౌర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు.
తెల్లవారుజామున 4 గంటల నుంచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం వ్యాస దారుమూర్తికి ఉపనిషత్ మంత్రోచ్చారణల మధ్య సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు. యాగశాలలో మూలమంత్ర హోమాలు, జయాది హోమాలు, బలి ప్రదానం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైదిక పద్ధతిలో నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, ఆలయ ఇన్‌చార్జి ఈవో విజయరామారావు, ఏఈఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
ఉత్సవాలకు హాజరైన అతిథులను ఆలయ సంప్రదాయం ప్రకారం శాలువాలతో సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
