తెలంగాణ స్మార్ట్‌ పోలీసింగ్‌ – యూజింగ్ టెక్నాలజీ దిశగా తెలంగాణ పోలీస్‌…

  • బేసిక్‌ పోలిసింగ్‌పై దృష్టి పెట్టాలి…
  • సమీక్ష సమావేశంలో డీజిపీ సివి. ఆనంద్‌

ఖమ్మం, ఆంధ్రప్రభ : తెలంగాణ స్మార్ట్‌ పోలీసింగ్‌ – యూజింగ్‌ టెక్నాలజీ అనే లక్ష్యంతో పోలీస్‌ అధికారులు ముందుకు సాగాలని రాష్ట్ర డీజిపీ సివి. ఆనంద్‌ అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాలో శాంతిభద్రతలు, నేర నియంత్రణపై ఎస్బి కాన్ఫిరెన్స్‌ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరాల నియంత్రణలో పకడ్బందీ చర్యలు, బేసిక్‌ పోలిసింగ్‌ పై దృష్టి, కీలక సంస్కరణలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్బంగా డీజిపీ మాట్లాడుతూ… పోలీస్‌ యూనిఫామ్‌ ధరించటం అదృష్టంగా భావించి.. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యంగా పోలీస్‌ సిబ్బంది పని చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కోట్ల మంది జనాభాలో కేవలం 0.16 శాతం మందికే ఈ అవకాశం లభిస్తుందని చెప్పారు. ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీసు అధికారి ప్రజల సేవకు అంకితం కావాలన్నారు. బేసిక్‌ పోలిసింగ్‌ పై దృష్టి పెట్టాలని, రాత్రి గస్తీని మరింత బలోపేతం చేసి ఆస్తి నేరాలను అరికట్టాలన్నారు.

చట్టం అనేది సామాన్యులకు రక్షణ కవచంలా అండగా ఉండాలని, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గూండాలకు మాత్రం కఠినమైన పోలీసింగ్‌ తప్పదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అదేవిదంగా సివిల్‌, భూ వివాదాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి మాఫియా, రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీసీటీఎన్‌ఎస్‌ 3.0, హాక్‌ ఐ 3.0, టీజీ కాప్స్‌ 3.0 వంటి సాంకేతిక వేదికలను సమర్థంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఇకపై ఎఫెక్టివ్‌ పోలీసింగ్‌, స్మార్ట్‌ పోలీసింగ్‌ సమాజ శ్రేయస్సు, ప్రజలకు భరోసా ఇచ్చే దిశగా తెలంగాణ పోలీస్‌ ముందుకు సాగుతోందని, ఇందుకు గాను ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), సీసీ కెమెరాలు, డేటా అనలిటిక్స్‌, సాక్‌ వ్యవస్థలతో, నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.

ప్రదానంగా తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం మావోయిస్టుల కంటే గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా పెద్ద సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ నియంత్రణలో ఇప్పటికే ఈగల్‌ పోలీసు బృందాలు గంజాయి సరఫరా, రవాణా మూలలను కట్టడికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. మాదకద్రవ్యాలపై యుద్ధం చేయాలి.. భావితరాలను కాపాడాలి అని స్పష్టం చేశారు.

డ్రగ్స్‌ ముఠాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నేరస్తులపై పీడీ యాక్ట్‌ వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, సైబర్ క్రైమ్‌ ఇప్పుడు పోలీసు శాఖకు ఛాలెంజ్‌గా మారిందని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారిందని, నేరగాళ్లు సైతం కొత్త కొత్త టెక్నాలజీని అనుసరిస్తూ నేరాలు చేస్తున్నారని, ఇది పోలీసులకు సవాలుగా మారిందన్నారు.

ఇందులో విద్యావంతులు ఎక్కువ నష్టపోతున్నారని అన్నారు. తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసు యంత్రాంగం, ప్రత్యేక విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వాహనదారులు వేగ పరిమితులు పాటించాలని, ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వాడకం తప్పనిసరి అని డీజీపీ స్పష్టం చేశారు.

మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.అరైవ్‌ అలైవ్‌, డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ అవగాహన కార్యక్రమాల ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గయని అన్నారు. రోడ్డు భద్రత కోసం ఈగల్‌ తరహాలో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలో నమోదవుతున్న నేరాల ధోరణులను, వాటిలో ఉన్న లోపాలను డీజీపీ సమగ్రంగా విశ్లేషించి, దర్యాప్తు నాణ్యత, సత్వర విచారణ, సాంకేతిక వినియోగం, ప్రజల భాగస్వామ్యం పెంపుదల ద్వారా మరింత సమర్థవంతమైన పోలీసింగ్‌ అందించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం పోలీస్‌ కమిషనర్‌ జిల్లా పోలీసింగ్‌, నేరాల ధోరణులు, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌, ట్రాఫిక్‌ నిర్వహణ, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా 2026లో 1,700 కిలోల గంజాయి, 2025లో సుమారు 4,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ వివరించారు.

సమావేశంలో ఐజిపి చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ గిరిధర్‌, అడిషనల్‌ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, విజయబాబు,ఏసీపీలు వసుంధర యాదవ్‌, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, మహేష్‌, శ్రీనివాసులు, సర్వర్‌, సత్యనారాయణ, సుశీల్‌ సింగ్‌, నర్సయ్య పాల్గొన్నారు.