హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మార్పు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మార్పు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బిజినెస్ బ్యూరో: ప్రజల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయి. తమ అభిరుచులకు అనుగుణంగా విలాసవంతమైన ఇళ్ల వైపు హైదరాబాద్ నగరవాసులు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో దిగువ మధ్యతరగతి వారి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతోంది. విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుకు మాత్రం డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్‌లోని గృహ మార్కెట్లో కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. చౌకైన ఇళ్లకు డిమాండ్ తగ్గుతుండగా, అధిక విలువ కలిగిన విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది.
చౌక ఇళ్లకు తగ్గుతున్న డిమాండ్
ప్రമുഖ బిజినెస్ విశ్లేషణ సంస్థ నైట్ ఫ్రాంక్ ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం రూ. 50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న యూనిట్లకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. పెరుగుతున్న ధరలు, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి మధ్య ఉన్న అంతరాన్ని ఇది సూచిస్తోంది. ఈ విభాగంలో విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ఈ కేటగిరీలోని ఇళ్ల విక్రయాలు 2025 జనవరి-మార్చి కాలంతో పోలిస్తే 23 శాతం తగ్గాయి. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఉన్న ఇళ్ల విక్రయాలు స్థిరంగా ఉన్నప్పటికీ, పెరుగుదల మాత్రం కనిపించలేదు. కేవలం నామమాత్రపు వృద్ధినే నమోదు చేసింది. ఇది మధ్యశ్రేణి గృహ మార్కెట్లో కొనుగోలుదారుల భావోద్వేగాలను ప్రతిబింబిస్తోంది.
ప్రీమియం సెగ్మెంట్లో భారీ పెరుగుదల
మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో పెరుగుతున్న కొనుగోలు శక్తిని ప్రతిబింబిస్తూ రూ. 1 కోటికి పైగా విలువ ఉన్న నివాస గృహాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2026 జనవరి-మార్చి మధ్య కాలంలో ఇవి 11 శాతం పెరిగాయి. రూ. 1 కోటి – రూ. 2 కోట్లు, రూ. 2 కోట్లు – రూ. 5 కోట్ల మధ్య ధర ఉన్న గృహాలు మంచి వృద్ధిని నమోదు చేయగా, అల్ట్రా ప్రీమియం విభాగంలో మరింత వేగవంతమైన పెరుగుదల కనిపించింది. మొత్తం విక్రయాల్లో 29 శాతం వాటా కలిగిన రూ. 1 కోటి – రూ. 2 కోట్ల మధ్య గృహాల విక్రయం 10 శాతం పెరిగింది. రూ. 2 కోట్లు – రూ. 5 కోట్ల ఖరీదు ఉన్న గృహాల కొనుగోలు 17 శాతం పెరగడం గమనార్హం. కొనుగోలుదారుల ప్రాధాన్యతలు ఈ మార్పుకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రీమియం విభాగం విస్తరిస్తున్నప్పటికీ, అందుబాటు ధరల గృహాల డిమాండ్ తగ్గుతోంది.
రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు ఖరీదు ఉన్న విల్లాల విక్రయాలు 12 శాతం పెరిగాయి. ముఖ్యంగా రూ. 20 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు ఖరీదు ఉన్న అత్యంత విలాసవంతమైన గృహాల కొనుగోలు 80 శాతం పెరగడం విశేషం. ఈ మార్పు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న విస్తృత పరివర్తనను సూచిస్తోంది. అధిక ఆదాయ వర్గాలు, ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తుండగా, మధ్య ఆదాయ వర్గాలు కొనుగోలులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు, మారుతున్న ఆదాయ పంపిణీ, గృహాల డిమాండ్లో మందగమనం మొత్తం మార్కెట్ సమతుల్యతపై దీర్ఘకాలిక సవాళ్లు విసిరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిర డిమాండ్
ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో గృహాల కొనుగోలు డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ, హైదరాబాద్ మార్కెట్ మాత్రం సమతుల్యంగా ఉందని నివేదిక పేర్కొంది.
