AP | ఉద్యోగాలు అందించే స్థాయికి యువత ఎదగాలి : మంత్రి స‌విత‌

కడప బ్యూరో, (ఆంధ్రప్రభ) : కడప నగరంలో నిర్మించే పీ 4 స్టార్టప్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలను రాయలసీమ జిల్లాల్లోని యువత సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి ఎస్.సవిత ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి యువత ఉద్యోగం అందుకునే స్థాయి నుండి ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యమ‌న్నారు. కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు కానున్న “స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్” నిర్మాణానికి జిల్లా ఇంచార్జి మంత్రి సవిత సోమవారం భూమిపూజ చేశారు. రూ.10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనానికి పి ఫోర్ కింద షిర్డీసాయి ఏక్ట్రికల్స్ రూ.4కోట్లు విరాళం అందించింది. జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులు రెడ్డి, జేసీ అదితిసింగ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ఉద్దేశించి మంత్రి సవిత మాట్లాడుతూ… కడపలో నిర్మించబోయే ఈ సెంటర్ ఎంతో అధునాతన సదుపాయాలతో అన్ని రకాల మౌలిక వసతులతో రూపుదిద్దుకోనుందన్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన కడప జిల్లా వాసుల సహకారంతో, వారిని అనుసంధానం చేసుకుని ఈ స్టార్టప్ హబ్ ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జి ప్లస్ 3 అంతస్తులతో, పిఈబి టెక్నాలజీ ఆధారంగా ఈ స్టార్ట్ అప్ కేంద్ర భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… కడపను పారిశ్రామిక, సాంకేతిక దిశలో ముందుకు నడిపించేందుకు ఇది ఒక మంచి విజ్ఞాన, ఉద్యోగ, ఉపాధి వనరుగా ఈ సెంటర్ ఉపయోగపడనుందన్నారు. కడప జిల్లా ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచే దిశగా ఈ పీ-4 స్టార్ట్ అప్ ఎంటర్ప్రెన్యూషిప్ పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను బిల్డింగ్ నమూనా మ్యాపు ద్వారా క్షుణ్ణంగా మంత్రికి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ ప్రాంత నడిబొడ్డున ఉన్న కడప నగరంలో రూపుదిద్దుకుంటున్న పీ-4 స్టార్ట్ అప్ కడప భవన నిర్మాణం భవిష్యత్తులో యువతకు గొప్ప ఉపాధి వనరుగా మరనుందన్నారు. సాంకేతిక విద్యా నైపుణ్యం ఉన్న ప్రతి విద్యార్థి, యువతకు ఎంతో ఉపయోగకరం అన్నారు. ప్రతి ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ప్రెన్యూషిప్ ను తీసుకురావాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు నేటి యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుందన్నారు. ఎంటర్ప్రెన్యూషిప్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.

జేసీ అదితిసింగ్ మాట్లాడుతూ… పారిశ్రామిక ప్రగతికి, యువతలో నూతన ఆవిష్కృత పటిమను, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబడిన “స్టార్టప్ కడప ఎంట్రప్రెన్యూర్‌షిప్ సెంటర్” మన జిల్లా యువతకు చేరువలో రూపుదిద్దుకోవడం అదృష్టకరమైన, ఆనందదాయకమైన విషయమ‌న్నారు.

తెదేపాపొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. కడపలో స్టార్ట్ అప్ సెంటర్ ద్వారా స్థానిక యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారి ఆలోచనలకు సరికొత్త రూపం కల్పిస్తూ ఎంటర్ప్రెన్యూషిప్ అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త ఆలోచనలకు కడప నగరం వేదిక కావడం గర్వించదగ్గ విషయమ‌న్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్, పీఆర్, బీసీ సంక్షేమ శాఖ, సంబందిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply