Loan Harassment Nellore : ఆప్పులోడి పీడనకు చెక్ Andhra prabha News

Loan Harassment Nellore : ఆప్పులోడి పీడనకు చెక్ Andhra prabha News

వీడిన అపర నక్షత్రకుడి చెర ​

ఇల్లాలికి ఇల్లు అప్పగింత

శభాష్​.. కలెక్టర్​ హిమాన్షు శుక్ల

మహిళ దినోత్సవం వేళ..

బాధితురాలి బాష్పాంజలి

( నెల్లూరు, ఆంధ్రప్రభ బ్యూరో)

వడ్డీ జలగ అవతారంలో.. ఓ మహిళలను మూడేళ్లుగా .. వడ్డీలకు వడ్డీలు పిండి.. ఆపై మరో ₹ 50,000లు కోసం.. ఆమెను ఇంటి నుంచి గెంటేసిన ఓ నెల్లూరు నక్షత్రకుడి కథకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్​ ఫుల్​ స్టాప్​ పెట్టారు. అతగాడి చక్రవడ్డీ లెక్కలు తీర్చలేక అల్లాడిన ఆ మగువ సహనం తారా స్థాయికి చేరుకోగా.. నెల్లూరు జిల్లా కలెక్టర్​ హిమాన్షు శుక్ల అండతో ఓ నిరుపేద మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ.. న్యాయం లభించింది. రుణ విముక్తి కలిగింది. గత నాలుగు మాసాలుగా.. బంధువుల ఇళ్లల్లో తలదాచుకుని.. కన్నీళ్లు మింగిన ఆ మహిళ.. ఈరోజున తన ఇంటికి చేరి ఆనందబాష్ఫాలు రాల్చింది. ఈ అప్పులోడు నక్షత్రకుడి పీడన ఎలాంటిదో తెలుసుకుందాం.

Loan Harassment Nellore : అపర నక్షత్రకుడు..

బుచ్చిరెడ్డిపాలెం పట్టణం శాంతినగర్‌కు చెందిన పేరం విజయకుమారి గత కొన్ని నెలలుగా అప్పులోడి చెరను అనుభవిస్తోంది. ఆమె తల్లి–తండ్రులు తన తమ్ముడి పెళ్లి కోసం నక్క లెల్లయ్య దగ్గర ₹ .70,000లు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చకముందే అమ్మానాన్న చనిపోయారు. అనంతరం చక్రవడ్డీ కలిపి లెక్క తేల్చితే.. ₹.2,30,000లకు అదనపు వడ్డీ కలిపి మొత్తం రూ.3,00,000గా నిర్ధారించి.. బలవంతంగా ప్రామిసరీ నోటు రాయించుకుని, ఇంటి పతర్రాలను తనఖా పెట్టుకున్నాడు. ₹ 9,000 వడ్డీగా మూడు ఏళ్ల పాటు ఆమె నుంచి వసూలు చేశాడు. కాలక్రమంలో వడ్డీతో కలిపి మొత్తం ₹.3 లక్షలు చెల్లించినప్పటికీ, ఇంకా ₹.50,000 ఇవ్వాలని చెప్పి ఇంటి పత్రాలు తిరిగి ఇవ్వకుండా ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని , ఆమెను ఇంటి నుంచి గెంటి వేశాడు.

Loan Harassment Nellore : చలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల ​

ఈ స్థితిలో ఆమె తన పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లక తప్పలేదు. ఇక విజయకుమారి తన పిల్లలతో నాలుగు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ, బంధువుల ఇళ్లలో తలదాచుకుంటూ జీవనం సాగించారు. చివరికి న్యాయం కోసం నెల్లూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి విజయకుమారి అర్జీ సమర్పించారు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని వేడుకుంది. విజయకుమారి కన్నీటి కథకు కలెక్టర్‌ హిమాన్షు శుక్ల చలించిపోయారు. తక్షణమే స్పందించారు. సమస్యను తెలుసుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘ కమిషనర్‌కు ఈ నెల 7వ తేదీన (07-03-2026) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే విచారణ చేపట్టిన అధికారులు పరిస్థితిని పరిశీలించి, నక్క యానదయ్య ఆక్రమణలోని ఇంటిని స్వాధీనం చేసుకుని అసలు యజమాని విజయకుమారికి అప్పగించారు.

Loan Harassment Nellore : అవధిలేని ఆనందం

నాలుగు నెలలుగా తలదాచుకోవటానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడిన విజయకుమారి, ఆనందానికి అవధులు లేవు. తనకు తిరిగి ఇల్లు దక్కటంతో . “నాకు న్యాయం జరిగింది. నా పిల్లలతో మళ్లీ నా ఇంట్లో ఉండగలుగుతున్నాను. కలెక్టరయ్యకు జీవితాంతం కృతజ్ఞురాలిని” అంటూ ఆమె భావోద్వేగంగా స్పందించారు. ఈ ఘటన ద్వారా బాధితుల సమస్యలపై సత్వర స్పందనతో చర్యలు తీసుకుంటే ప్రజలకు న్యాయం త్వరగా అందుతుందని మరోసారి రుజువైంది. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యల పట్ల సానుభూతితో వెంటనే స్పందిస్తున్నారని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

Loan Harassment Nellore : అప్పులోళ్లకు చెక్​

అప్పుల వ్యాపారం పేరుతో ప్రజలను వేధించడం, అధిక వడ్డీలు వసూలు చేయడం, బలవంతంగా పత్రాలపై సంతకాలు తీసుకోవడం వంటి అమానుష చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. అప్పు ఇచ్చిన పేరుతో పేద ప్రజలను మానసికంగా, శారీరకంగా వేధించడం, వారి ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా సమాజంలో చాలాచోట్ల కనిపిస్తున్న తీవ్రమైన సమస్య అని ఆయన తెలిపారు.

అప్పుల పేరుతో ప్రజలను భయపెట్టి, అవమానపరచి, ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడే వారందరికీ ఇది గట్టి హెచ్చరికగా భావించాలని పేర్కొన్నారు. ప్రజలను వేధిస్తూ అన్యాయంగా వ్యవహరించే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Leave a Reply