The next Chief of Army Staff | భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఈయనే..
The next Chief of Army Staff | భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఈయనే..
- జూన్ 30న బాధ్యతల స్వీకరణ
- నాలుగు దశాబ్దాల సైనిక అనుభవం కలిగిన అధికారి
- జూన్ 30న బాధ్యతలు చేపట్టనున్న కొత్త ఆర్మీ చీఫ్..
- ఉపేంద్ర ద్వివేది స్థానంలో ధీరజ్ సేథ్
ఆంధ్రప్రభ: భారత సైన్యానికి తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (Chief of Army Staff)గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్న ధీరజ్ సేథ్.. జూన్ 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
40 ఏళ్ల సైనిక అనుభవం..
దాదాపు నాలుగు దశాబ్దాల సైనిక సేవల అనుభవం కలిగిన ధీరజ్ సేథ్.. ఎడారి ప్రాంతాలు, జమ్మూకశ్మీర్, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో కీలక కమాండ్ బాధ్యతలు నిర్వహించారు. సైన్యంలో వివిధ స్థాయిల్లో సేవలందిస్తూ విశేష అనుభవాన్ని సంపాదించారు. ధీరజ్ సేథ్ గతంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్, సదరన్ కమాండ్లకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C)గా పనిచేశారు.
పశ్చిమ సరిహద్దులోని రెండు ప్రధాన ఆపరేషనల్ కమాండ్లకు నాయకత్వం వహించిన అరుదైన అధికారుల్లో ఆయన ఒకరు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతా మిషన్‌లో భాగంగా అంగోలాలో సేవలందించారు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
సైన్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ధీరజ్ సేథ్‌కు పరమ విశిష్ట సేవా పతకం (PVSM), ఉత్తమ్ యుద్ధ సేవా పతకం (UYSM), అతి విశిష్ట సేవా పతకం (AVSM) లభించాయి. జూన్ 30న జనరల్ హోదాలో బాధ్యతలు చేపట్టనున్న ధీరజ్ సేథ్ పదవీకాలం ఆగస్టు 31, 2028 వరకు కొనసాగనుంది. ప్రస్తుత భద్రతా సవాళ్లు, సరిహద్దు పరిస్థితుల నేపథ్యంలో ఆయన నాయకత్వం భారత సైన్యానికి కీలకంగా మారనుంది.
