భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి..
ఆర్డీవో శ్రీదేవి.
మునుగోడు, ఆంధ్రప్రభ : భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా సమగ్ర భూముల రీ సర్వే చేపడుతున్నందున రైతులు, ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి కోరారు. వ్యవసాయ భూముల రీ సర్వే నిర్వహించి రైతులకు భూధార్ కార్డులు అందజేసే కార్యక్రమంలో భాగంగా మండలంలోని సింగారం గ్రామాన్ని తొలి గ్రామంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వ, ఇనాం, రహదారులు, పట్టా భూములతో పాటు గ్రామ పరిధిలోని అన్ని భూములను సమగ్రంగా సర్వే చేస్తామని తెలిపారు.ఈ ప్రక్రియతో భూముల సరిహద్దులు స్పష్టంగా నమోదై, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని చెప్పారు.ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తహసీల్దార్ నేలపట్ల నరేష్ మాట్లాడుతూ మొదట సర్వే నంబర్ పరిధిలోని మొత్తం భూమిని కొలిచి, అనంతరం భాగాల వారీగా విభజించి ప్రతి రైతుకు ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ధోటి నారాయణ,సర్పంచ్ కుంభం అండాలు రవీందర్ రెడ్డి,డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి,ఆర్‌ఐ విష్ణు,సర్వేయర్ అరుణజ్యోతి, ఉపసర్పంచ్ ఉప్పునూతల వెంకన్న, పంచాయతీ కార్యదర్శి గీత,జీపీఓ లింగయ్య, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,రైతులు, మహిళలు పాల్గొన్నారు.
