పెనమలూరుకు నారా లోకేష్ రాక
- పునాదిపాడులో నూతన కళాశాలను ప్రారంభించనున్న విద్యాశాఖ మంత్రి
కంకిపాడు, ఆంధ్రప్రభ: పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలోని నూతన కళాశాల భవనాన్ని ఈనెల 27 లేదా 30వ తేదీన ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కంకిపాడు మండలం, పునాదిపాడు గ్రామంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించే కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, స్థానిక కూటమి నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. కళాశాల భవనాన్ని అమెరికాలో స్థిరపడినప్పటికీ స్వగ్రామ అభివృద్ధిపై అపారమైన మమకారంతో ఉన్న దాత పోలవరపు మధుసూదన్ రావు, వారి కుమార్తె శోభా ఉదార సహకారంతో నిర్మించారని అన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన వ్యయాన్ని పూర్తిగా వారి దాతృత్వంతో సమకూర్చి నిర్మించారన్నారు.
తాము చదువుకున్న విద్యాసంస్థ మరింత అభివృద్ధి చెందాలని సంకల్పంతో మధుసూదన్ రావు పలుమార్లు స్వయంగా వచ్చి, పాఠశాల, కళాశాల అభివృద్ధికి అవసరమైన అంశాలపై సూచనలు అందిస్తూ, భవిష్యత్తులోనూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్ ని కలిసి కళాశాల భవనాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా దాతలు కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తుది తేదీ ఈరోజు ఖరారు కానుందని తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఉదయం సుమారు 9 గంటలకు నియోజకవర్గానికి చేరుకుని, కళాశాల భవన ప్రారంభోత్సవంతో పాటు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని, అనంతరం ఆయన కళ్యాణ మండపం నందు జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
