Nadendla Manohar | బలమైన చోట్ల జనసేన పోటీ..
Nadendla Manohar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు స్థానిక ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన త్యాగాలను ఈ సందర్భంగా నాదెండ్ల గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అప్పట్లో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కూటమి విజయం కోసం ముందుకు సాగారని అన్నారు. ఆ నిర్ణయాలను ఇప్పుడు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెట్టి కొందరు వ్యాఖ్యానించడం సమంజసం కాదని హితవు పలికారు.
స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుందని తెలిపారు.
కూటమి భాగస్వామ్య పక్షాలను గౌరవిస్తూనే అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని జనసేన కార్యకర్తలకు తగిన అవకాశాలు కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని ఆయన పేర్కొన్నారు.
