మొండికుంట కాలువ ఆక్రమణలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు !
- కల్వర్టు పొడవు తగ్గించి అక్రమ నిర్మాణాలు
- 80 శాతం మురుగునీరు ఇదే కాలువ ద్వారానే..
- నిర్మాణాలను కూల్చేసి, రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి
- అడిషనల్ కలెక్టర్‌కు బీజేపీ కౌన్సిలర్లు, నేతల వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ వెళ్లే ప్రధాన రహదారిలో గల మొండికుంట కాలువ స్థలం తీవ్ర ఆక్రమణలకు గురవుతోందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావులు ను చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కౌన్సిలర్ బుడ్డ సురేష్, పార్టీ జిల్లా కార్యదర్శి ఆలే చిరంజీవి, మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు వంగాల రమాకాంత్ గౌడ్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
గతంలో కూల్చేసినా.. మళ్లీ అక్రమ నిర్మాణాలు!
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చౌటుప్పల్ – వలిగొండ నాగారం రోడ్డులోని సర్వే నెంబర్ 175, 176 పరిధిలో ప్రవహిస్తున్న మొండికుంట కాలువ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. గత 2020 సంవత్సరంలో కూడా ఈ ఆక్రమణల విషయమై అప్పటి మున్సిపల్ కమిషనర్ రామ్ దుర్గారెడ్డి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. వారు స్పందించి 100 మీటర్ల పొడవుతో కల్వర్టు, 100 ఫీట్ల వెడల్పుతో కాలువ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అదే స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా, కనీసం 20 మీటర్ల పొడవు కూడా లేకుండా కల్వర్టును పునర్నిర్మిస్తూ కాలువను కుదించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణానికే ముప్పు.. సర్వే నిర్వహించాలి
చౌటుప్పల్ పట్టణానికి చెందిన 80 శాతానికి పైగా మురుగునీరు, వర్షపు నీరు ఈ వలిగొండ రోడ్డులోని మొండికుంట కాలువ గుండానే ప్రవహిస్తుందని నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలువ సైజును తగ్గిస్తే భవిష్యత్తులో పట్టణం మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్వపు యధాస్థితి ప్రకారం 100 మీటర్ల పొడవుతోనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, 175, 176 సర్వే నెంబర్ల పరిధిలో పరిమితికి మించి జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సదరు స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని, రెవెన్యూ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి, కాలువ సరిహద్దులను అధికారికంగా గుర్తించాలని సూచించారు. ఈ అక్రమ కట్టడాల వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వ ఆస్తులను, కాలువ స్థలాలను కాపాడాలని అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారి, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
