currency notes | కరెన్సీలో కొత్త మార్పులకు ఆర్బీఐ కసరత్తు..

currency notes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్ ఆధారిత) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. మొదటి దశలో రూ.10, రూ.20 నోట్లతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితం ఆధారిత నోట్లతో పాటు, మరింత మన్నికైన పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టడం ద్వారా కరెన్సీ నాణ్యతను మెరుగుపరచాలని ఆర్బీఐ యోచిస్తోంది. ముఖ్యంగా ఎక్కువగా వినియోగంలో ఉండే తక్కువ విలువ కలిగిన నోట్ల జీవితకాలాన్ని పెంచడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.

పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. తేమ, దుమ్ము, చిరిగిపోవడం వంటి సమస్యలను తట్టుకునే సామర్థ్యం వీటికి ఎక్కువగా ఉంటుంది. అలాగే నకిలీ నోట్ల తయారీని అరికట్టేందుకు ఆధునిక భద్రతా లక్షణాలను కూడా వీటిలో పొందుపరచవచ్చు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నట్లుగా 2027 నుంచి పాలిమర్ నోట్లు ఖచ్చితంగా అమల్లోకి వస్తాయన్న అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని ఆర్బీఐ పేర్కొంది.