నర్సంపేట రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

నర్సంపేట రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- బిట్స్ కాలేజీ బస్సు ఢీకొని బైకర్‌కు తీవ్ర గాయాలు
నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ ; నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారిపైశుక్రవారంసాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బాలాజీ విద్యాసంస్థలకు చెందిన కాలేజీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం, బాలాజీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన రూట్ నంబర్-15 బస్సు (ఏపీ03 వై 2783) అతివేగంగా వచ్చి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.ఢీకొన్న తీవ్రతకు ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమై రోడ్డుపై పడిపోయింది.

ప్రమాద సమయంలో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి ఎడమ కాలుకు తీవ్ర గాయాలతో పాటు తలకు బలమైన దెబ్బలు తగిలినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి అత్యవసర సేవలకు సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుడి వివరాలు సేకరించి కేసు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.స్థానికులు మాత్రం విద్యాసంస్థల బస్సులు పట్టణంలో అధిక వేగంతో నడుస్తున్నాయని, తరచూ ప్రమాదాలకుకారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
