వరంగల్ శివనగర్‌లో ప్రజల అవస్థలు
వరంగల్ శివనగర్‌లో ప్రజల అవస్థలు
ఇళ్లలోకి భవనాలలోకి వరద నీరు చేరిక
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరం (Warangal city) లోని 34 డివిజన్ శివనగర్ పద్మశాలి కల్యాణ మండపం జంక్షన్ రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. గురువారం కూడా వరద ఉధృతి తగ్గలేదు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏ వీధిలోకి వెళ్లినా సుమారు మోకాలు లోతులో నీరు ప్రవహిస్తుంది. దారి పొడవునా కాలువలు, డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. బుధవారం రాత్రి జొమాటో డెలివరీ అతను ఈ నీటిలో ద్విచక్ర వాహనంతో సహా పడిపోయాడు.

గర్భిణి ప్రసవ వేదన..
వరద ఉధృతి నేపథ్యంలో 34 వ డివిజన్ శివనగర్ (Shivanagar) శ్రీ సత్య సాయి దేవాలయం లైన్లో ఓ మహిళ ప్రసవ వేదనతో ఇబ్బందులు పడుతుండగా.. జీడబ్ల్యూసీ పారిశుధ్య సిబ్బంది స్పందించి ట్రాక్టర్లు అక్కడి నీటి నుంచి మెయిన్ రోడ్డుకు క్షేమంగా తీసుకొని రావడం జరిగింది. అక్కడి నుంచి ఆ మహిళ కారులో ఆసుపత్రికి వెళ్లిపోయారు. మోకాలు లోతు నీటిలో శివనగర్‌లోని చిల్డ్రన్స్ ఆసుపత్రులకు పిల్లలను తల్లిదండ్రులు భుజాలపై ఎత్తుకొని తీసుకొని రావడం జరుగుతుంది. ఆటోలు కూడా రాలేని పరిస్థితి శివనగర్‌లో నెలకొంది. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి వరద నీరు మళ్లించే ప్రయత్నం చేయగలరని ప్రజలు కోరుతున్నారు.
