KNR | కోతుల కారణంగా ప్రాణం బలి…
ధర్మపురి, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోతులు ఆడుకుంటూ డాబాపై నుంచి తోసిన సిమెంట్ ఇటుక ఓ మహిళపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన కొనపర్తి పద్మ (50) ఇంటి సమీపంలో ఉండగా, డాబాపై ఆడుకుంటున్న కోతుల కారణంగా సిమెంట్ ఇటుక కింద పడింది. అది పద్మ తలకు బలంగా తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న ధర్మపురి రెండో ఎస్సై రవీందర్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాలనీల్లో కోతుల సంచారం పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
