బీఎల్‌ఓలకు ఎస్ఐఆర్‌పై శిక్షణ
బీఎల్‌ఓలకు ఎస్ఐఆర్‌పై శిక్షణ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్)పై కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ పార్టీల నాయకులు, బీఎల్వోలు, బీఎల్‌ఏలకు తహశీల్దార్ ఎం. నరేష్, శిక్షణ అధికారులు శేఖర్, ప్రభాకర్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు. ఓటర్లు వాటిని పూర్తిగా నింపి బీఎల్‌ఓలకు నేరుగా లేదా బూత్ లెవల్ ఏజెంట్లకు సమర్పించవచ్చని పేర్కొన్నారు. పారదర్శకంగా, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే వాటిని పరిశీలించి అర్హులైన వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చుతామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వారు, ద్వంద్వ ఓటు నమోదులు కలిగిన వారి పేర్లను తొలగిస్తామని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల నమోదు, నివాసం మారిన వారి ఓటును కొత్త ప్రాంతానికి బదిలీ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని వివరించారు.
ప్రతి వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలని, ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అటువంటి సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఎన్నికల హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్, బీఎల్‌ఓలు మైలారం సుధాకర్, బద్రి, మల్యాల సుభాష్ గౌడ్, అజ్మత్ పాషా, రేంజర్ల మహేందర్, బద్దం రమేష్, పి. నవీన్, రామస్వామి, రాజేష్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
