సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ధర్నా

  • కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన కార్మికులు..
  • వినతిపత్రం స్వీకరించిన అధికారులు

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికుల సమస్యలపై సీఐటీయూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం కార్మిక వర్గం కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటి సదుపాయం కల్పించాలని, రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నెల నెల వేతనాలు చెల్లించాలని, అదనపు డ్యూటీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై కూర్చున్న కార్మికులను అడ్డు తొలగాలని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కార్మికులు మాకే నిబంధనలు వర్తిస్తాయి అంటూ ప్రశ్నించారు. మేము ఎక్కడ పని చేస్తున్నామో, ఎంత వేతనం ఇస్తున్నారో, ఎలా బ్రతుకుతున్నామో కనీసం చెప్పుకోవడానికి కూడా అర్హత లేదా అంటూ కార్మిక వర్గం కన్నెర్ర చేసింది. తాము చేసే శ్రమ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, తాము ఓట్లేస్తేనే ప్రభుత్వం గెలిచిందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభకు సీఐటీయూ జిల్లా కోశాధికారి పీవీ ప్రతాప్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ.. కనీస వేతనాలను సవరించి 20 ఏళ్లు అయిందని, షెడ్యూల్ పరిశ్రమలలో లక్షల మంది కనీస సౌకర్యాలు, వేతనాలు లేకుండా సంవత్సరాల తరబడి పని చేస్తున్నారని తెలిపారు. ఓట్లు లెక్కల్లో తప్ప మరే లెక్కల్లోనూ ఈ కార్మికులను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, ఖర్చులు, అనారోగ్యాలు కార్మికులను ఆలోచింపజేస్తున్నాయని, వివిధ రాష్ట్రాల్లో కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగానే వేతనాలు పెరిగాయని అన్నారు.

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు మాట్లాడుతూ.. కార్మికులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ, చట్ట ప్రకారం వారికి అందాల్సిన వేతనాలు, సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కార్మికులను అడ్డుకోవడం, నిలబడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు.

షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్యపై ప్రభుత్వానికి సరైన లెక్కలు కూడా లేవని పేర్కొన్నారు. వలస కార్మికులు పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అరకొర వసతుల్లో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారి శ్రమతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, కనీస వేతనాలు, నివాస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు.

గత నెల రోజులుగా జిల్లాలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నామని వాసుదేవరావు తెలిపారు. రైస్ మిల్లులు, గ్యాస్, పంచాయతీలు, ఫ్యాక్టరీలు, మున్సిపల్ విభాగాలు, ఆక్వా, ప్రైవేట్ విద్యా సంస్థలు, భవన నిర్మాణ రంగం, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, పెట్రోల్ బంకులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు తదితర రంగాల్లో వేలాది మంది పనిచేస్తున్నారని చెప్పారు.

సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జేఎన్‌వీ గోపాలం మాట్లాడుతూ.. కార్మికుల పోరాటానికి సీపీఎం అండగా ఉంటుందని అన్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయించే ప్రభుత్వం, కార్మికుల కనీస హక్కులను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు.

అనంతరం కార్మికులు బరికేడ్లను తోసుకొని కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లారు. కలెక్టరేట్ గేటు ముందు కూర్చుని కలెక్టర్ వచ్చి మా సమస్యలు వినాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు బృందం కలెక్టరు జాయింట్ కలెక్టర్ తో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ బయటికి వచ్చి వినతి పత్రాలు తీసుకుని, కార్మికులతో మాట్లాడి, వారు చెప్పే సమస్యలు విని, జాయింట్ మీటింగ్ వేసి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎం. ఆంజనేయులు, ఎస్ రంగారావు, డి కళ్యాణి, ఎస్ వెంకటేశ్వరరావు, గొర్ల రామకృష్ణ, యం త్రిమూర్తులు, కే రామకృష్ణ, పట్టణ పేదల సంక్షేమ సంఘం నాయకులు ఎం వైకుంఠరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, బాతిరెడ్డి జార్జి, కెవిపిఎస్ జిల్లా నాయకులు కే క్రాంతి బాబు, వరలక్ష్మి, లారెన్స్ కుమారి, ఇంజెటి శ్రీనివాస్, చల్లబోయిన వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.