జ‌ల‌పాతం సంద‌ర్శ‌న‌కు నో ప‌ర్మిష‌న్

ములుగు, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలపాతం నిండుకుండలా మారి ఉప్పొంగిపోతోంది. సుమారు 160 మీటర్ల వెడల్పుతో, 50 అడుగుల ఎత్తు నుంచి భారీ ఉధృతితో వరద నీరు కిందికి దూసుకొస్తుండటంతో ఆ ప్రాంతం మొత్తం జలమయమైంది. జలపాతం అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ వలయం (సేఫ్టీ కారిడార్) పూర్తిగా నీట మునిగిపోయింది.

పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బొగత జలపాత సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జలపాతం పరిసర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు, అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు, పర్యాటకులు జలపాతం సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరద ఉధృతి తగ్గిన తర్వాతే సందర్శనకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.