గూడెంలో కాంగ్రెస్ వర్గపోరు..
ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలు చించివేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు శనివారం బహిర్గతమయ్యాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వర్గీయులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరుకానున్న నేపథ్యంలో, ఆయనకు స్వాగతంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు చించివేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘జై పీఎస్‌ఆర్’ అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు ఎంపీ వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు, పలు దళిత సంఘాల నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతం కావడంతో ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
