రెండో రోజూ ఎడతెరిపి లేని వర్షం.. జగిత్యాలలో హై అలర్ట్

పాఠశాలలు, కళాశాలలకు సెలవు..

లో-లెవల్ వంతెనలపై రాకపోకలు బంద్

జగిత్యాల, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన ఆయన, వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సహాయం కోసం 7989193131 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు లో-లెవల్ వంతెనలు నీటమునిగాయి. అనంతారం లో-లెవల్ బ్రిడ్జి, నేరెళ్ల లో-లెవల్ బ్రిడ్జి, ఫకీర్ కొండాపూర్–యామపూర్ లో-లెవల్ బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వరద నీరు తగ్గే వరకు వంతెనలను దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

మరోవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో రైతులకు ఊరటనిచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడంతో ఆందోళన చెందిన రైతాంగంలో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. పంటలకు అవసరమైన తేమ అందుతుండటంతో రైతులు వర్షాన్ని లెక్కచేయకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.