మెరిసే చర్మం కోసం క్రీములు కాదు.. ఈ 6 పోషకాలే అసలైన రహస్యం!
మార్కెట్లో ఎటు చూసినా.. తక్షణ నిగారింపునిస్తామంటూ ఊరించే సిరమ్‌లు, ఫేస్ మాస్క్‌లు, ఓవర్‌నైట్ క్రీమ్‌లు ఎన్నో కనిపిస్తాయి. కానీ, శరీరంలోపల ఏం జరుగుతుందన్నదానికి చర్మం ఒక అద్దం లాంటిదని…. ఏ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అయినా ఇట్టే చెబుతారు. సరైన పోషకాలు లేని ఆహారపు అలవాట్లను కేవలం స్కిన్‌కేర్ ఉత్పత్తులతో ఏమాత్రం భర్తీ చేయలేరు. శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందనప్పుడు, ఆ ప్రభావం నేరుగా ముఖంపైనే కనిపిస్తుంది. చర్మం నిర్జీవంగా, పొడిబారిపోవడమే కాకుండా ముడతలు కూడా త్వరగా వస్తాయి.
కడిగేస్తే పోయేది కాకుండా.. నిజమైన, దీర్ఘకాలం నిలిచి ఉండే సహజ నిగారింపును సొంతం చేసుకునేందుకు మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమాద్దర్, కణాల స్థాయి నుంచి చర్మానికి పోషణనిచ్చే ఆరు ప్రాథమిక పోషకాల గురించి వివరిస్తున్నారు.
విటమిన్ ఇ : కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్ ఇ, కాలుష్యం మరియు సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి చర్మ కణాలను రక్షిస్తుంది. ఇది కణాల స్థాయిలో తేమను లాక్ చేయడం ద్వారా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ‘కాలిఫోర్నియా బాదం’ పప్పులలో ఈ పోషకం పుష్కలంగా ఉంటుంది. ఉదయం తాగే స్మూతీలో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని బాదం పప్పులను కలుపుకోవడం ద్వారా దీనిని సులభంగా అలవాటు చేసుకోవచ్చు.
విటమిన్ సి : చర్మాన్ని బిగుతుగా, సాగే గుణంతో ఉంచేది ‘కొల్లాజెన్’. ఈ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి విటమిన్ సి అత్యంత అవసరం. ఇది చర్మంపై నల్లటి మచ్చలును క్రమంగా తగ్గించి, నిర్జీవంగా ఉన్న చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఉసిరి, సిట్రస్ జాతి పండ్లు (నిమ్మ, నారింజ తదితరాలు), బెల్ పెప్పర్స్ (క్యాప్సికమ్) ద్వారా రోజువారీ విటమిన్ సి అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ : ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మపు పైపొరను ఏర్పరుస్తాయి. ఇవి చర్మంలో తేమను నిలుపుకోవడమే కాకుండా హానికరమైన పదార్థాలను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఆహారంలో ఒమేగా-3 లోపిస్తే, చర్మం తరచుగా పొడిబారడం, పొట్టు రాలడం లేదా మంటగా అనిపించడం జరుగుతుంది. అవిసె గింజలు, బాదం, చియా సీడ్స్ వంటి మొక్కల ఆధారిత వనరులను రోజువారీ భోజనంలో ఎంతో సులభంగా చేర్చుకోవచ్చు.
జింక్: చర్మం లోపలి పొరల్లో నూనె ఉత్పత్తిని జింక్ నియంత్రిస్తుంది, అలాగే కణాల మరమ్మత్తుకు తోడ్పడుతుంది. అందుకే జింక్ తీసుకోవడం వల్ల చర్మం క్లియర్‌గా ఉంటుంది, మొటిమల సమస్యలు తగ్గుతాయి. శనగలు, తృణధాన్యాలు ఈ సూక్ష్మ ఖనిజానికి మంచి రోజువారీ వనరులు.
బీటా-కెరోటిన్: విటమిన్ ఏ కు ముందు రూపమే ఈ బీటా-కెరోటిన్. ఇది చర్మ కణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తుంది. చనిపోయిన కణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే నిర్జీవత్వాన్ని ఇది నివారిస్తుంది. ఇది చర్మానికి ఆరోగ్యకరమైన ఛాయను ఇస్తుంది. క్యారెట్లు, చిలగడదుంపలు, బచ్చలికూర ద్వారా దీనిని అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో పొందవచ్చు.
బయోటిన్: బయోటిన్ అనగానే ఇది కేశాల ఆరోగ్యానికి మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ దీని ప్రయోజనాలు చర్మానికి కూడా ఎంతో అవసరం. చర్మంలోని ఫ్యాటీ యాసిడ్ జీవక్రియను నిర్వహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మం ఉపరితలాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. అలాగే చర్మ సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. గుడ్లు, కాలిఫోర్నియా బాదం వంటి నట్స్, అరటిపండ్లు ఈ బి-విటమిన్ ను అందించే సులభమైన వనరులు.
వీటన్నింటి కోసం మీ జీవనశైలిని పూర్తిగా మార్చేసుకోవాల్సిన అవసరం లేదన్నది ఇక్కడ మరో శుభవార్త అని రితికా సమాద్దర్ వివరిస్తున్నారు. సమతుల్యమైన, మొక్కల ఆధారిత ఆహారం ద్వారా ఈ ఆరు పోషకాలు సులభంగా లభిస్తాయి. పైగా మన భారతీయ వంటగదుల్లో ఇవి చాలావరకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కాస్మొటిక్స్ దుకాణాల్లో మీరు వెతుకుతున్న ఆ నిగారింపు, చాలా సందర్భాల్లో ఇప్పటికే మీ ముందున్న పళ్లెంలోని ఆహారంలోనే దాగి ఉంది.
