ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని పోలీస్ శాఖ అప్రమత్తమైంది. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ మేరకు బుధ‌వారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపీఎస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, హెలిప్యాడ్ ప్రాంతం, సభా స్థలం, ఇతర ముఖ్య ప్రదేశాలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సీఎం పర్యటన సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. సీఎం పర్యటనలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మార్గదర్శక ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్‌ నుంచి పర్యటించే ప్రాంతాల వరకు అన్ని చోట్ల భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.

సీఎం ప‌ర్య‌ట‌న ఇలా..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత ల పథకంతోపాటు పలు ప్రాజెక్ట్‌ల పెండింగ్‌ పనుల పరిశీలనకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజుల (4, 5న) పర్యటన ఖరారైంది. తొలిరోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి హైదరాబాద్‌ నుంచి హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరనున్నారు. ఏరియల్‌ వ్యూ ద్వారా కోయిల్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బీమా–1 లిఫ్ట్‌ను సందర్శించి.. అక్కడ నిర్మించే రోడ్‌ కం బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని కర్ణాటక మంత్రి బోసురాజుతో కలిసి పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీఎం హెలీకాప్టర్‌లో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు చేరుకోనున్నారు. పరిశీలన అనంతరం హెలీకాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌కు రానున్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్యాకేజీ–2 (నారాపూర్‌ రిజర్వాయర్‌), ప్యాకేజీ–3 (కెనాల్‌ ) పనులను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సోమశిలలోని హరిత గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని.. ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయా ప్రాజెక్ట్‌ల పెండింగ్‌ పనులపై సమీక్షించనున్నారు. 2వ రోజు ఇలా.. రెండో రోజు శుక్రవారం సోమశిల నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పీఆర్‌ఎల్‌ఐ ప్యాకేజీ–1, ఎల్లూరులోని ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌–1ను సందర్శించనున్నారు. అనంతరం నార్లాపూర్‌ నుంచి హెలీకాప్టర్‌లో ఉయ్యాలవాడకు చేరుకోనున్నారు. ఇరిగేషన్‌ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో బిజినేపల్లి మండలం కుమ్మెరకు చేరుకుని పీఆర్‌ఎల్‌ఐ ప్యాకేజీ–8, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించి ప్యాకేజీ 9, 10, 11, స్టేజీ–3 పంప్‌హౌస్‌కు సంబంధించి ప్యాకేజీ–8 పనులను పరిశీలించనునున్నారు. ఆ తర్వాత హెలీకాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలోని కర్వెన రిజర్వాయర్‌కు చేరుకుని ప్యాకేజీ 14, 15 పనులను పరిశీలించనున్నారు. అనంతరం జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్‌ రిజర్వాయర్‌కు చేరుకుని ప్యాకేజీ 17, 18లో కొనసాగుతున్న పనులపై ఆరా తీయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి తిరిగి హెలీకాప్టర్‌ హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.