ఎల్లంపల్లికి పోటెత్తిన వరద…
- ప్రాజెక్టుకు 2 లక్షల 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
- 16 టీఎంసీలకు చేరిన నిల్వ
- పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
- అవసరమైతే గేట్లు ఎత్తే అవకాశం
గోదావరిఖని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద సాగర్ (ఎల్లంపల్లి) ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహం పెరగడంతో రిజర్వాయర్ నిండుకుండలా కనిపిస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం వరకు 2 లక్షల 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పెరిగింది.
గంట, గంటకు ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. వర్షం ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో రాత్రి వరకు రిజర్వాయర్ లోకి వరద తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. గడిచిన మూడు రోజుల వరకు శ్రీపాదసాగర్ (ఎల్లంపల్లి) ప్రాజెక్టులో 7 టీఎంసీలు (శతకోటి ఘనటపు) అడుగులునీరు మాత్రమే ఉండగా… ప్రస్తుతం రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.2107 టీఎంసీలు (శతకోటి ఘనటపు) అడుగుల నీటి సామర్థ్యం ఉంది.
148 మీటర్ల లెవెల్ కు గాను ప్రస్తుతం రిజర్వాయర్ లో 146. 5 3 మీటర్ల లెవెల్ లో నీటి సామర్థ్యం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ఎగవన్ ఉన్న మహారాష్ట్రలో కూడా విస్తారమైన భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరుకుంటున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ కు నీటి సరఫరా..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ తాగునీటి అవసరాల కోసం 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నంది పంప్ హౌస్ ద్వారా 15, 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన సాగు నీరు, ప్రజలకు తాగునీరు సమృద్ధిగా లభ్యం కావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మంచిర్యాల మున్సిపాలిటీకి తాగునీటి కోసం ఎల్లంపల్లి నుండి యధావిధిగా నీటి సరఫరా జరుగుతుంది.
అప్రమత్తంగా ఉండండి : నీటిపారుదల శాఖ
ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 90 వేల క్యూసెక్కుల నీరు ఇంట్లో అవుతుంది. ఈ క్రమంలో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలతో వచ్చే వరద నీటితోపాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఇదిలా ఉండగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని బాధిత గ్రామాల ప్రజలను నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రాజెక్టుకు దిగువన గల ప్రభావిత గ్రామాల ప్రజలు , రైతులు , మత్స్యకారులు, గొర్ల కాపరులు నది వద్దకు వెళ్లరాదని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్ర చారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇన్ఫ్లో పెరిగే అవకాశం..
వర్షం ఇంకా తగ్గుముఖం పెట్టకపోవడం… ఎగువ ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు… ఎగో నున్న కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రాత్రి వరకు మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి సమయంలో వరద ఉధృతి పెరిగితే సుమారుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
