గ్రంథాలయాలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

గ్రంథాలయాలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం
మంత్రి నారా లోకేష్‌తో ఎం.ఎస్. బేగ్ భేటీ
డిజిటల్ లైబ్రరీలు, పోటీ పరీక్షల శిక్షణపై చర్చ
గ్రామీణ విద్యార్థులకు ఆధునిక విద్యా వనరులే లక్ష్యం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం . ఎస్ . బేగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణ, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణా సదుపాయాల విస్తరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రంథాలయాలను విద్యార్థులు, యువతకు జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యా వనరులు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎం.ఎస్. బేగ్ జిల్లాలోని పలు గ్రంథాలయాల ప్రస్తుత పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక సదుపాయాల కల్పన, కంప్యూటర్ల ఏర్పాటు, డిజిటల్ సేవల విస్తరణ, పాఠకులకు ఆధునిక సౌకర్యాల కల్పనకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
