రూ.35 కోట్లతో ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన
- ప్రధాని మోదీ చేతుల మీదుగా సాటిలైట్ రైల్వే స్టేషన్ ప్రారంభం
- రూ.35 కోట్లతో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు
- సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధిలో రాయనపాడు స్టేషన్ మైలురాయి: డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా
- కొండపల్లి స్టేషన్‌ను కూడా అమృత్ భారత్‌లో అభివృద్ధి చేయాలి: ఎంపీ కేశినేని చిన్ని
- రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుని శుక్రవారం ప్రజలకు అంకితమైంది. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించగా, రాయనపాడు స్టేషన్ కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా రాయనపాడులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
కీలక మైలురాయి..
దక్షిణ కోస్తా రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం లక్ష్యం ప్రపంచస్థాయి ప్రయాణికుల సౌకర్యాలను కల్పించడమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టేషన్ రూపకల్పన చేసినట్లు తెలిపారు.
అన్ని స్టేషన్లలో అభివృద్ధి..
విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం ద్వారా రైల్వే స్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నాటి కొండపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరారు. అమరావతి రాజధానికి భవిష్యత్తులో బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
చారిత్రాత్మక అభివృద్ధి…
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ల పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రాయనపాడు స్టేషన్ ఆధునికీకరణతో స్థానిక ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రయాణికుల భద్రత, ఆధునిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కూడా కేంద్రం సహకరిస్తోందని చెప్పారు.
ఏపీకి బుల్లెట్ రైలు..
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రైల్వే వ్యవస్థను ఆధునికీకరించడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కీలకపాత్ర పోషించిందన్నారు. గతంతో పోలిస్తే రైల్వే బడ్జెట్ గణనీయంగా పెరిగిందని, రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుదీకరణ, వందే భారత్ రైళ్ల విస్తరణ, ఆధునిక స్టేషన్ల నిర్మాణం ద్వారా భారతీయ రైల్వే ప్రపంచస్థాయి ప్రమాణాలను చేరుకుంటోందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్టుల అమలుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాయనపాడు స్టేషన్ ఆధునికీకరణతో విజయవాడ నగరానికి ప్రత్యామ్నాయ సాటిలైట్ రైల్వే కేంద్రంగా ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకోనుండగా, ప్రయాణికుల రద్దీని తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషించనుంది. ఆధునిక వేచి గదులు, డిజిటల్ సమాచార వ్యవస్థ, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, మెరుగైన ప్లాట్‌ఫారాలు, విశాలమైన ప్రవేశ మార్గాలు, పార్కింగ్ వంటి సదుపాయాలతో రాయనపాడు స్టేషన్ ప్రాంతీయ రైల్వే అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

