సదర్ మాట్కు కొనసాగుతున్న వరద ఉధృతి
అనికట్ నుంచి గోదావరిలోకి 17 వేల క్యూసెక్కుల నీటి విడుదల
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లి వద్ద ఉన్న సదర్ మాట్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
వరద ప్రవాహం పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై మత్తడి గోడ మీదుగా నీటిని గోదావరిలోకి మళ్లిస్తున్నారు. అడ్డుగోడపై నుంచి అనికట్ ద్వారా 17 వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి ప్రవహిస్తోందని సదర్ ఏఈఈ విష్ణు తెలిపారు.
సదర్ మాట్ అనికట్ సామర్థ్యం 12 అడుగులు కాగా, గురువారం నీటిమట్టం 9 అడుగులకు చేరిందని పేర్కొన్నారు.
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, విద్యుత్ మోటార్లు ఉన్న రైతులు, మత్స్యకారులు గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లవద్దని నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
